సామరస్యం, వినయము మరియు ఆరోగ్యానికి సంకేతం

నమస్కార ముద్ర మన భారతీయ సంప్రదాయంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మన వేళ్ళలో ఉన్న పంచతత్వాలు ఈ ముద్ర వేసినప్పుడు ఒక దానికొకటి కలిసి ఉండి, సమానంగా పని చేస్తాయి. కావున ఇది ప్రాణ మరియు జీవశక్తి యొక్క ప్రసారాన్ని ప్రవహింప చేస్తుంది. తద్వారా ప్రశాంతత మరియు కరుణ కలిగిస్తుంది.
ఇది సుమారు 4,000 సంవత్సరాల నుంచి వాడుతున్నారని తెలిసింది. దీనిని మన భారత దేశంలోనే ఎక్కువగా వాడుతారు.
నమస్కారాన్ని సంస్కృతంలో నమస్తే/ వందనం/ అంజలి అంటారు.
“నమః” అనగా మనిషిలో గల ఆత్మను గౌరవించుట. “నమస్” అనగా వినయం. “తే” అనగా మీకు అని అర్ధం.
“నమస్తే” అనగా “మీకు భక్తితో కూడిన ప్రణామం” అని అర్ధం.
నమస్కారం వలన కలిగే ప్రయోజనాలు:
- నమస్కారం ప్రేమను పంచుతుంది
- నమస్కారం క్రమశిక్షణ పెంచుతుంది
- నమస్కారం చల్లని దీవెన ఇస్తుంది
- నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది
- నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది
- నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది
- నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది
- నమస్కారం కన్నీళ్లను కడిగి వేస్తుంది
- నమస్కార సంస్కారం నీ విలువ పెంచుతుంది
నమస్కార ముద్రలు ఎన్నో రకాలు:
అంజలి ముద్ర/ ప్రణామ ముద్ర

చేతులు సమస్కార స్థితిలో హృదయం వద్ద ఉంచిన ఈ ముద్ర ఏర్పడును. ఈ ముద్ర సాధన వలన హృదయ చక్రం (అనాహత) ప్రభావితం అవుతుంది. అందువలన ప్రేమ, అభిమానం, ఆప్యాయత, స్పందన మొ|| ఏర్పడతాయి. వైజ్ఞానిక పరంగా హృదయం వద్ద థైమస్ గ్రంధి ప్రభావితమై రోగనిరోధక శక్తి కలిగించి నకారాత్మక ఆలోచనలు పోగొట్టును. ఈ ముద్ర మనలో గల అహంకారం తొలగిస్తుంది. ఈ ముద్ర స్వాగతించడానికి లేక ధన్యవాదాలు తెలపడానికి పనిచేయును.
అగ్ర ముద్ర:

ఈ ముద్ర సాధనకు వజ్రాసనంలో కూర్చొని చేతులు చాపి నమస్కార స్థితిలో ఉంచ వలెను. ఈ సాధన వలన భుజాలకు బలం చేకూరును.
కైలాస ముద్ర:

ఈ ముద్రకు చేతులు తలపైన ఉంచి నమస్కార స్థితిలో ఉండవలెను. ఈ ముద్రలో సహస్రార చక్రం ప్రభావితం అవుతుంది.
గోవిందముద్ర:

ఈ ముద్రకు చేతులు తల పైన పెట్టి పైకి సాగ దీసి నమస్కార స్థితిలో ఉండ వలెను. ఈ ముద్రలో విషుద్ధ మరియు సహస్రార చక్రాలు ప్రభావితం అవుతాయి.
సాష్టాంగ ముద్ర/ అష్టాంగ ముద్ర:

సాష్టాంగ = స + అష్ట + అంగ ; స= సాహిత్; అష్ట = ఎనిమిది; అంగ =శరీర భాగాలు. అనేక రకాలైన నమస్కారాలలో సాష్టాంగ నమస్కారం ఒకటి. సాష్టాంగం అంటే మానవునికి ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయుట. దీనినే “దండాకార” నమస్కారం అందురు అనగా పడిపోయిన కర్ర లాగ నేలపై ఉండడం. ఇది దేవాలయంలో బోర్లా పడుకొని దేవునికి నమస్కరించి ఆయా అంగాలు నేలకు తగిలించుట. ఇందులో దాగి ఉన్న ముద్రలు:
1. ఉరస్సు నమస్కార ముద్ర: ఛాతి నేలకు తగిలిచడం
2. శిరస్సు నమస్కార ముద్ర: నుదురు నేలకు తగిలించడం
3. దృష్టి నమస్కార ముద్ర: కనులు మూసుకుని భగవంతుని తలచు కోవడం
4. మనస్సు నమస్కార ముద్ర: మనఃస్పూర్తిగా నమస్కరించడం
5. వాచస్ నమస్కార ముద్ర: భగవంతుని మాటలతో నమస్కరించడం (స్మరించడం)
6. పద్భ్యాం నమస్కార ముద్ర: కాలి వేళ్ళు నేలకు
7. కరాభ్యాం నమస్కార ముద్ర: చేతులు నేలకు
8. జానుభ్యాం నమస్కార ముద్ర: మోకాళ్ళు నేలకు
పంచాంగ ముద్ర (స్త్రీలకు మాత్రమే):

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మాతృ స్థానం నేలకు తగిలించకూడదు. కావున వారు పంచాంగ నమస్కార ముద్రనే చేయవలెను అని శాస్త్రం చబుతుంది. వజ్రాసనముతో మొదలు పెట్టి, రెండు చేతులు పైకి ఎత్తి పెట్టి, ముందుకు వంగుతూ నుదురు భూమికి ఆన్చి, పైన చేతులతో నమస్కరించ వలెను. ఈ స్థితిలో ఐదు అంగాలు భూమికి ఉండును (పాదాలు, మోకాళ్ళు, మోచేతులు, నుదురు, నమస్కరించిన చేతులు). కావున దీనిని పంచాంగ నమస్కార ముద్ర అందురు.
నమస్కార ముద్ర వలన మనలో ఏ మూల దాగి ఉన్న అహమైనా నశిస్తుంది. మనో వికారాలు మాయమౌతాయి.
పాదాభివందనం వలన ప్రయోజనం కలుగును. శుభకార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు, కేవలం శుభకార్యాలలోనే కాక పెద్దవారు కనిపించనప్పుడు కూడా వారి పాదాలను తాకుతారు.
అసలు పెద్ద వారి పాదాలను ఎందుకు తాకాలి?
భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవ సూచకంగా ఉన్న పురాతన పద్ధతి. అయితే,
కొందరు పాదాలను అపరిశుభ్రంగా భావిస్తారు. పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు,
అర్ధవంతమైన సూచనలున్నాయి. పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచాలి.
అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం. సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు, స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉంటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతుంది.
పెద్ద వారికి పాదాభి వందనము ఎలా చేయాలి?

పెద్దవారి పాదాలను తాకడానికి నడుము వంచి కుడి చేతిని వారి ఎడమ కాలి మీద పెట్టాలి. అలాగే ఎడమ చేతిని వారి కుడి కాలి మీద ఉంచాలి. అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ (closed circuit) ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఆ సమయంలో వారి శక్తి, జ్ఞానం మనకు చేరుతాయి. ఫలితంగా మంచి మనస్సుతో వారిచ్చే దీవెనలు ఫలిస్తాయి.
పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల వారి పాద ధూళిలో కూడా ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. ‘మేము కూడా మీ మార్గంలో నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని సంపాదించడానికి
ఆశీర్వదించండి’ అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా వారి పాదాలను తాకుతాము.
ముద్రలపై మరియు వాటి ఆరోగ్య ప్రయోజనాలపై మరింత జ్ఞానం పొందడానికి మా పుస్తకం సంపూర్ణ ముద్ర విజ్ఞానం పుస్తకాన్ని చదవండి!
రచయితలు: యోగాచార్య ధరణీప్రగడ ప్రకాశ్ రావు +91 98490 66765, ధరణీప్రగడ దీప్తి +91 89788 01247