Phone Number

+91 98490 66765 / +91 89788 01247

Email

prakash.dharani@gmail.com

Opening Hours

Mon - Fri: 7AM IST - 7PM IST

పశ్చిమోత్తానాసనం

పశ్చిమోత్తానాసనం లేదా పశ్చిమతానాసనం – ఇది సంస్కృత పదం. పశ్చిమం= శరీరంలో వెనుక భాగం/వీపు భాగం అని అర్థం, తాన్ = సాగదీయడం, ఉత్తాన్=సాగదీయడం. శరీరం వెనుక భాగాన్ని సాగదీసే ఆసనం. ఇది కూర్చుని చేసే ఆసనం. ఈ ఆసనం చేయడం కఠినం కావున దీనిని ఉగ్రాసనం అందురు. “శివ సంహిత”లో దీని ప్రస్తావన కలదు. ఈ ఆసనం శివునికి ప్రీతికరమైనది.

పశ్చిమోత్తానాసనం

ముందు మాట

ఏ ఆసనం చేయాలన్నా ముందు జాగ్రత్త ( precaution ) అవసరం. లేని ఎడల శరీరానికి లాభం కన్నా నష్టం ఎక్కువ. పశ్చిమోత్తానాసనం చేసే చాలా మందికి నడుము నొప్పి సమస్య  కలుగుతుంది. ఆ సమస్య రాకూడదు అంటే పద్ధతి ప్రకారం చేయవలెను. ముందుకు వంగే ఆసనం ఏదైనా కాని ఒక పద్దతిగా చేయవలెను. లేని ఎడల శరీరానికి కీడు చేస్తుంది.ఈ ఆసనమునకు వయోపరిమితి లేదు. ఏ వయసు వారైనా వేయవచ్చు.

  • ఇది ఎంతో ముఖ్యమైన ఆసనము, కానీ సరియైన పద్ధతిలో చేయవలెను.
  • దీని సాధన వలన అనేక మహత్తరమైన లాభాలు కలవు.
  • ఆసనాలు ఉదయం లేక సాయంత్రం చేయవచ్చును.

విధి

  1. నేలపై జంబుకానా/యోగ మ్యాట్/ ఆసనం వేసుకుని ఆసనం పై కూర్చోవాలి.
  2. కాళ్ళు చాపి కలిపి ఉంచాలి. ఈ స్థితి లో మోకాళ్లు వంచకూడదు.
  3. రెండు చేతులూ మోకాళ్ళ పైన ఉంచాలి (దండాసన స్తితి).
  4. శ్వాస తీసుకుంటూ చేతులు ముందు నుంచి లేక పక్కనుంచి పైకి ఎత్తాలి. ఈ స్థితిలో నడుము, తల వీలైనంత నిటారుగా ఉంచాలి. మోచేతులు వంచకూడదు.
  5. శ్వాస వదులుతూ ఛాతిని ముందుకు వుంచుతూ ముందుకు వంగాలి. ఈ స్థితి లో తల తిన్నగా ఉంచాలి.
  6. చూపుడు, మద్య వేళ్ళతో కాళ్ళ బొటన వేళ్ళను (లేక పాదాలను) పక్కనుండి (లేక చేతులను కాళ్ళ వెలుపల నుంచి ముందుకు  చాపి) పట్టుకోవాలి. ఈ స్థితిలో మోచేతులు కొంచెం దూరం చేయాలి.
  7. నెమ్మదిగా మోచేతులు వంచుతూ నేలకు ఆనించాలి.
  8. తలను వంచి మోకాళ్ళ కన్నా ముందుకు ఆనించాలి.
  9. శ్వాస తీసుకుంటూ, కాలి వేళ్ళను వదులుతూ చేతులు పైకి ఎత్తుతూ లేవాలి.
  10. శ్వాస వదులుతూ చేతులు ఇరు ప్రక్కల నుంచి దించాలి. మోచేతులు వంచకూడదు.
  11. చేతులు వెనుకకు, తల వెనుకకు, నడుము తిన్నగా చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి.
పశ్చిమోత్తానాసనం

ఈ విధంగా 3 సార్లు చేయాలి.

పశ్చిమోత్తానాసనం

సూచన

  1. ఈ ఆసనంలో కూర్చుని కాళ్ళు తిన్నగా ఉంచాలి. మోకాళ్ళు వంచ కూడదు. ఈ స్థితిని దండాసనం అందురు.  ఈ స్థితిలో కాళ్ళు తిన్నగా శరీరం నిటారుగా 90°ఉండవలెను. లేని ఎడల పశ్చిమోత్తానాసనం చేయకూడదు.
  2. కాలి  బొటన వేలుని చూపుడు, మద్య వేళ్ళతో పట్టుకోవాలి (లేక పాదాలు పక్కనుండి పట్టుకోవచ్చు).
  3. ఈ ఆసనంలో శరీరం సహకరించిన వరకు ముందుకు వంగాలి, తరువాత తలను వంచాలి.
  4. తలను కాళ్ళ దగ్గిర, ఛాతిని తొడలపైన ఆనించాలి. శ్వాస వదులుతూ ముందుకు వంగాలి.
  5. కొద్ది సమయం కదల కుండా ఉండాలి. శక్త్యానుసారం చేయాలి. ఈ స్థితిలో పొట్ట లోపలికి ఉంచాలి. నడుము, తల తిన్నగా ఉంచాలి.
  6. నడుము (వెన్ను) చేతులు పైకి ఎత్తి నప్పుడు పైకి లాగాలి. చేతులు ముందుకు సాగదీయాలి.
  7. ఈ ఆసనం కాళీ కడుపుతో చేయాలి.
  8. వీలైనంత వరకూ కాళ్ళు తిన్నగా, పిరుదులు నేలకు, నడుము, తల తిన్నగా ఉంచుతూ వంగాలి.
  9. సర్వైకల్ సమస్య ఉన్న వారు మోకాళ్ళకు గడ్డాన్ని తగిలించ వలెను.
  10. ఈ ఆసన స్థితిలో వెన్నెముక వంగకూడదు.

సమయం

ఈ ఆసనంలో 30 సెకెన్ల నుంచి 15 నిమిషాల వరకు ఉండవచ్చును. ముందు 30 సెకెన్ల తో మొదలు పెట్టి నెమ్మదిగా సమయం పెంచవచ్చును.

శ్వాస విధానము

  • ఆసన స్థితిలో బాహ్య కుంభకంలో లేక సామాన్య శ్వాసలో ఉండవచ్చును.
  • శ్వాస తీసుకుంటూ రెండు చేతులూ పక్క నుంచి పైకెత్తవలెను.
  • ఈ ఆసనం వేస్తున్నప్పుడు శ్వాస వదులుతూ వేయాలి. శ్వాస తీసుకుంటూ ఆసనం వదలాలి.

ఆధ్యాత్మిక ప్రయోజనాలు

  • ఇది వీపులో గల వెన్ను పూసలలో సుషుమ్న నాడి ద్వారా ప్రాణ శక్తిని ప్రవహించు నట్లు చేయు ఆసనము. ఇది అభ్యసించినప్పుడు ధ్యాస మణిపూర చక్రం పైన ఉంచాలి.
  • ఈ ఆసన సాధన వలన ధ్యాన స్థితిలో ఎక్కువ సమయం కూర్చో గలరు. కుండలిని జాగృతి చేయును.

మానసిక ప్రయోజనాలు

ఈ ఆసన సాధన వలన ఒత్తిడి, ఆత్రుత తగ్గి మానసిక శాంతి కలిగి మంచి నిద్ర పడుతుంది.

చంచల మనసు వారికి ఇది మంచిది. మానసిక సమస్యలు తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. తలనొప్పి రానివ్వదు.

శారీరక ప్రయోజనాలు

  • ఈ ఆసనం వలన మన శరీరంలో కాలి వేళ్ళనుంచి తలపైన సహస్రార చక్రం వరకు ప్రతీ భాగము ప్రభావితం అవుతాయి.
  • ఇది ఒక పద్ధతిలో చేసిన చాలా రకాల శారీరక, మానసిక సమస్యలు పోగొట్టును.
  • ఈ సాధన వలన పాంక్రియాస్ ప్రభావితమై మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది, బాన పొట్ట తగ్గుతుంది.
  • పొట్టలో ఉన్న మాంస కండరాలు ఆరోగ్యంగా తయారయి, ఉదర పనితీరును మెరుగుపరుస్తుంది.
  • అందువల్ల అరుగుదల బాగుచేసి మలబద్దక సమస్య దూరం చేస్తుంది.
  • ఈ ఆసన సాధన వలన వెన్నెముక, భుజాలు, తొడల వెనుక కండరాలు సాగుతాయి.
  • కాలి పిక్కలు రోజూ గట్టి పడుతూ ఉంటాయి. ఈ ఆసనం నిత్య సాధన వలన అవి సాగబడి,కాలి పిక్కలు మెత్తబడి శరీరం పెరగడానికి సహాయపడుతుంది. కావున 18 ఏళ్ళు లోపు పిల్లలు పొడుగు పెరగడానికి సహాయపడుతుంది.
  • తొడల వెనుక కండరాలు (Hamstrings )మరియు వెన్ను పూస చక్కగా పనిచేయడానికి ఈ ఆసనం ఎంతో సహకరిస్తుంది. పశ్చిమోత్తానాసన సాధన వలన శరీరం మరియు మెడలో మాంస కండరాలు సాగి రక్త ప్రసరణ చక్కగా జరిగి, వెన్నుకు బలాన్నిస్తుంది. తద్వారా ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది.
  • ఈ ఆసన సాధన వలన మన వెనక శరీరంలో గల అన్ని కండరాలు ప్రభావితం అవుతాయి. మహిళలకు ఋతు సమస్యలకు, మెనూపాస్ సమస్యలకు ఈ ఆసనం మంచి పరిష్కారం. ఈ ఆసనం వలన సహజంగా ఉడ్డియాన బంధం, మూల బంధం జరుగుతుంది. తిన్న పదార్థాలు సరిగ్గా అరగక పుల్ల తేన్పులు కలిగే సమస్య తగ్గుతుంది.
  • ఈ ఆసనం నిత్య సాధన వలన రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. పశ్చిమోత్తానాసనం నిత్యసాధనవలన నపుంసకం దూరం చేస్తుంది. ఎముకలలో కరుకుదనం /పెళుసు (temper) తగ్గిస్తుంది.
  • కిడ్నీలు ఆరోగ్యంగా ఉండి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మహిళలకు PCO  సమస్యలకు ఇది మంచి ఆసనం.
  • ఊపిరితిత్తులు మరియు లీవర్ లకు బలం చేకూరుతుంది. ఆపాదమస్తకం రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది.
  • కిడ్నీలు, అడ్రినల్, స్ప్లీన్ ప్రభావితం అవుతాయి. ముఖంలో మంచి కాంతి వస్తుంది.  గ్రంధులు చక్కగా పనిచేస్తాయి.
  • హార్మోన్ల సమస్యలకు మంచిది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వెన్నుకు బలాన్నిస్తుంది. ఛాతి విప్పారుతుంది .
  • పొట్ట తగ్గుతుంది.

నిషేధం

  • తిన్న వెంటనే ఈ ఆసనం చేయకూడదు.
  • సయాటికా సమస్యలవారు ఈ ఆసనం చేయకూడదు.
  • గర్భవతి మహిళలు పశ్చిమోత్తానాసనం చేయకూడదు.
  • సర్వైకల్ స్పాండిలోసిస్ వారు ఈ ఆసనం చేయకూడదు.
  • ముందుకు వంగుతున్నప్పుడు నడుము, తల వంచకూడదు.
  • నడుము నొప్పి వారు మెల్లిగా లేవ వలెను, ఒత్తిడి పెట్టకూడదు.
  • హృదయ సమస్యలు, హై బిపి, మెడ సమస్యలు, స్పైనల్ సర్జరీ అయిన వారు ఈ ఆసనం చేయకూడదు.

-యోగాచార్య ధరణీప్రగడ ప్రకాశ్ రావ్ – 98490 66765

సూచన: నిష్ణాతులైన యోగచార్యుల వద్ద యోగాను అభ్యసించాలి అనుకుంటున్నారా? యోగచార్య ధరణీప్రగడ ప్రకాశ రావు గారి వద్ద స్వయంగా అభ్యసించండి! యోగాను, ముఖ్యంగా పశ్చిమోత్తానాసనం ఎలా చేయాలి అని మరియు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం మెళుకువలన్నీ తెలుసుకోండి!

Recommended Articles

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *