
సూర్య నమస్కారాలు 12 ఆసనాలతో కూడిన చిన్న పాటి వ్యాయామం. ప్రతీ అసనములో సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం సమ్మిళితమై ఇమిడి ఉంటాయి. శ్వాస మీద ధ్యాస పెట్టి సూర్య నమస్కారాలు చేయవలెను. వీటి వలన శరీరంలో ప్రతీ అవయువములో వ్యాధి నిరోధక శక్తి పెరిగి విష పదార్థాలు సహజ సిద్దంగా తొలగిపోతాయి. నరాల మరియు కండరాల వ్యవస్థలు సమతుల్యంగా పనిచేస్తాయి. రుచి, వాసన, వినికిడి, దృష్టి వంటి లోపాలు సారి చేయడంతో పాటు శరీరం, ముఖం తేజోవంతంగా తయారు అవుతాయి. విద్యార్ధులలో ఈ సూర్య నమస్కారాలు జ్ఞాపకశక్తి పెరుగుదలకు సహాయపడుతాయి. కావున ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు సాధన చేసిన మంచిది.

చరిత్ర
- వాల్మీకి రామాయణం యుద్ధకాలంలో సూర్య నమస్కారాల ప్రస్తావన:
- రావణాసురిడితో యుద్దానికి ముందు శ్రీరామునికి అగస్త్య మహాముని సూర్య నమస్కారాలను బోధిస్తారు.
- వేదాల్లో, పురాణాలలో సూర్య నమస్కారాల ప్రస్తావన ఉంది.
- సూర్య నమస్కార ఆధారం వేద కాలంలో ఉద్భవించిందని మరియు వేద ఋషుల ద్వారా అనేక తరాలకు అందించ బడిందని నమ్ముతారు.
- సూర్య నమస్కారాలు ఆయుర్వేదంలో కలవు.
- భారతదేశంలోని పూణేలో ఔంధ్ (రాజు) పాలకుడు భవన్ రావ్ శ్రీనివాసరావు పంత్ ప్రతినిధి 1928 లో రాసిన ‘ది టెన్-పాయింట్ వే టు హెల్త్: సూర్య నమస్కార్’ అనే పుస్తకంలో ఈ క్రమాన్ని సూర్య నమస్కార్ అని పిలిచాడు. రాజు ఈ క్రమాన్ని తాను కనుగొన్నానని ఎప్పుడూ చెప్పుకోలేదు, కానీ తాను చిన్నప్పుడు దీనిని ఆచరించేవాడినని చెప్పాడు.
- 19వ శతాబ్దానికి ముందు ఏ “హఠ యోగా” గ్రంథంలోనూ సూర్య నమస్కారం నమోదు కాలేదని శాస్త్రవేత్త “జోసెఫ్ ఆల్టర్” పేర్కొన్నాడు. “ఔంధ్ రాజు భగవాన్ శ్రీనివాసరావు పంత్” ప్రతినిధి సూర్య నమస్కారాన్ని ఆదర్శవంతమైన శారీరక ఆరోగ్యాన్ని సాధించడానికి ఒక వ్యాయామంగా ప్రాచుర్యం పొందాడు. ఆయన దానిని పాఠశాల పాఠ్యాంశాల్లో కూడా చేర్చాడు. మరియు ఇది 20వ శతాబ్దంలో ప్రారంభమైనది.
- 1930 ప్రారంభంలో, ఆధునిక యోగా పితామహుడు కృష్ణమాచార్య మైసూర్‌లో యోగా బోధిస్తున్నాడు. తన తరగతి గది ప్రక్కనే ఉన్న హాలులో, మరొక ఉపాధ్యాయుడు సూర్య నమస్కారం యొక్క శారీరక బోధనా తరగతికి కూడా నాయకత్వం వహిస్తున్నాడు. అప్పటి వరకు, ఈ అభ్యాసం బాగా స్థిర పడలేదు. దాని ఖచ్చితమైన విధానం ఏమిటి అని తెలియలేదు.
- కృష్ణమాచార్య తర్వాత ఆయన శిష్యులు అష్టాంగ విన్యాస సృష్టికర్త కె. పట్టాభి జోయిస్ మరియు అయ్యంగర్ యోగా పితామహుడు బి.కె.ఎస్ అయ్యంగర్ సూర్య నమస్కారాన్ని నేర్చుకుని దానిని వారి యోగా శైలులలోకి అభివృద్ధి చేశారు.
పద్ధతి
సూర్య నమస్కారాలలో 12 ఆసనాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన భీజాక్షరం, ప్రభావితమయ్యే చక్రం ఈ క్రింది పట్టికలో కలవు:
సంఖ్య | భీజాక్షరం | మంత్రం | చక్రం | ఆసనం |
1 | హ్రాం | ఓం మిత్రాయ నమః | అనహత | ప్రణామాసన్ |
2 | హ్రీం | ఓం రవయే నమః | విశుద్ది | హస్త ఉత్తానాసన్ |
3 | హృం | ఓం సూర్యాయ నమః | మణిపుర | పాద హస్తాసన్ |
4 | హ్రైం | ఓం భానవే నమః | స్వాదిష్టాన | అశ్వ సంచలనాసన్ |
5 | హ్రౌం | ఓం ఖగాయ నమః | సహస్రార | పర్వతాసన్ |
6 | హ్రా: | ఓం పూష్ణే నమః | ఆజ్ఞా | అష్టాంగాసన్ |
7 | హ్రాం | ఓం హిరణ్యగర్భాయ నమః | మూలాధార | భుజంగాసన్ |
8 | హ్రీం | ఓం మరీచయే నమః | సహస్రార | పర్వతాసన్ |
9 | హృం | ఓం ఆదిత్యాయ నమః | స్వాధిష్ఠాన | అస్వ సంచలనాసన్ |
10 | హ్రైం | ఓం సవిత్రే నమః | మణిపుర | పాద హస్తాసన్ |
11 | హ్రౌం | ఓం అర్కాయ నమః | విశుద్ది | హస్త ఉత్తానాసన్ |
12 | హ్రా: | ఓం భాస్కరాయ నమః | అనాహత | ప్రణామాసన్ |
ఆసనాలు
1.ప్రణామాసనం/నమస్కార ముద్ర – చేతులు హృదయం వద్ద ఛాతీ ముందు నమస్కార స్థితిలో ఉంచి మంత్రోచ్ఛారణకు శ్వాస తీసుకోవడంపై దృష్టి.

2. హస్త ఉత్తానాసనం/అర్ధ చంద్రాసనం – ఇది వెనుకకు వంగే భంగిమ. శ్వాస పీల్చుకుంటూ చేతులను తల పైకి ఎత్తి, శరీరమంతా సాగదీస్తూ వెనుకకు వంగాలి. పైన నమస్కార స్థితిలో చేతులు ఉంచాలి.

3. హస్త పాదాసనం – చేతులు సాగదీస్తూ, శ్వాస వదులుతూ ముందుకు వంగి చేతులు నేలను తాకాలి, ఈ స్థితి లో కాళ్లు నిటారుగా మోకాళ్ళు వంచకుండా ఉంచాలి. చేతులు కాళ్ళకు ఇరువైపులా ఉంచాలి.

4. అశ్వ సంచలనాసనం – శ్వాస తీసుకుంటూ కుడి కాలు వెనక్కి వేయాలి, మరో కాలు కదపకుండా నడుము వంచాలి.

5. పర్వతాసనం/ దండాసనం– శ్వాస వదిలి రెండవ కాలును వెనుకకు పెట్టి, తల కిందకు, నడుము పైకి, మోకాళ్ళు వంచ కుండా, మడమలు నేలకు /పాదాలు నేలకు ఆన్ఛవలెను.

6. అష్టాంగ నమస్కారం – చేతులపై బరువు ఉంచి శరీరాన్ని ముందుకు తెచ్చి, నడుము దించి కాలి వేళ్ళ పై నుంచవలెను. భుజాల నుండి మడమల వరకూ తిన్నగా నుంచి మోకాళ్లు, ఛాతీ మరియు గడ్డం నేలను తాకేలా ఉంచవలెను.
సూచన: స్త్రీలు అష్టాంగ నమస్కారానికి బదులుగా శశాంక ఆసనము చేయవలెను. సూచన: స్త్రీలు అష్టాంగ నమస్కారానికి బదులుగా శశాంక ఆసనము చేయవలెను. శశాంక ఆసనం: చేతులూ కాళ్ళూ కదపకుండా నడుము దించుతూ మోకాళ్లు నేలకు ఆన్చి, శరీరాన్ని వెనుకకు తీసుకుని, పిరుదులు మడమల పైన ఉంచి నుదురు నేలకు ఆంచవలెను. ఈ స్థితి లో చేతులు సాగబడినట్లు ఉంచవలెను.

7. భుజంగాసనం – శ్వాస తీసుకుంటూ శరీరాన్ని ముందుకు నెడుతూ చేతులపై లేవాలి. ఈ స్థితిలో ఛాతీ ముందుకు, నడుము కిందకు, తలపైకి ఎత్త వలెను. పాదాలు తన్ని పట్టి ఉంచవలెను.

8. పర్వతాసనం/ అధో ముఖ స్వనాసనం – శ్వాస వదులుతూ తల కిందకు, నడుము పైకి, మోకాళ్ళు వంచ కుండా మడమలు నేలకు /పాదాలు నేలకు ఉంచవలెను.

9. అశ్వ సంచలనాసనం – శ్వాస తీసుకుంటూ కుడి కాలు ముందుకు వేయాలి. మరో కాలు కదపకుండా నడుము వంచ వలెను.

10. పాద హస్తాసనం – శ్వాస వదులుతూ చేతులు పాదాలకు ఇరువైపులా ఉంచాలి. ఈ స్థితిలో కాళ్లు నిటారుగా ఉంచి (మోకాళ్ళు వంచ కూడదు), చేతులు కాళ్ళకు ఇరువైపులా ఉంచవలెను.

11. హస్త ఉత్తానాసం/అర్ధ చంద్రసన్ – (వెనుకకు వంగే భంగిమ) శ్వాస తీసుకుంటూ పైకి లేస్తూ చేతులను తలపైకి ఎత్తి, శరీరమంతా సాగదీస్తూ వెనుకకు వంగాలి. పైన చేతులు నమస్కార స్థితిలో ఉంచవలెను.

12. ప్రణామాసనం/నమస్కార ముద్ర – శ్వాస వదులుతూ చేతులు హృదయం వద్ద ఛాతీ ముందు నమస్కార స్థితిలో ఉంచాలి. ధ్యాస శ్వాసపై ఉంచవలెను.

సూర్య నమస్కారాలు రెండు రౌండ్లు చేసిన ఒక జత అవుతుంది. ఒక సారి కుడి కాలు వెనుకకు పెట్టి చేస్తే రెండవ సారి ఎడుమ కాలు వెనుకకు పెట్టి చేయాలి. అప్పుడు ఒక జత పూర్తి అవుతుంది. ఒక సారి 12 ఆసనాలు (భంగిమలు) చొప్పున రెండు సార్లు చేయవలెను.
సూర్య నమస్కారాలు 8 ఆసనాలతో 12 దశల్లో చేయబడతాయి.
ఏ సమయంలో చేయాలి:
- రోజూ సూర్యోదయం సమయంలో నిత్య సాధన చేసిన శరీరానికి మనస్సుకు మంచిది.
- సూర్య నమస్కారం అంటే ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించడం. ఇది ప్రాచీన కాలం నుండి ప్రాచుర్యంలో ఉంది.
- వీటిని ఉదయాన్నే బ్రాహ్మముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలనిస్తాయి.
ఎన్ని రౌండ్లు చేయాలి:
రోజుకు 3 నుంచి 5 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయాలి?( ఒక రౌండ్ అనగా 12 భంగిమలు) సాధారణంగా ప్రారంభీకులకు మూడు నుండి ఐదు రౌండ్లు సాధన చేయవలెను.
శ్వాస విధానం:
శరీరం వెనుకకు వంచేటప్పుడు శ్వాస తీసుకోవడం, ముందుకు వంచేటప్పుడు శ్వాస వదలడం చేయాలి.
ఫలితాలు:
- ఇవి రోజూ చేసిన ఆరోగ్య సమస్యలు దరిచేరవు.
- వీటికి ఎటువంటి పరికరాలు అవసరం లేని సమగ్ర వ్యాయామం.
- సూర్య నమస్కారాల వలన శక్తి పెరుగుతుంది.
- ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రతి ఒక్కరికీ సూర్య నమస్కారం ఒక వరం.
- వీటిని నిత్య సాధన చేయడం వలన భయంకరమైన వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చును.
- యోగాలో అతి ముఖ్యమైన ప్రక్రియల్లో సూర్య నమస్కారాలు ఒకటి.
- ఇవి యోగాలో సర్వ శ్రేష్టమైనవి. వైజ్ఞానిక పరంగా గుర్తింపు పొందినవి, మరియు మంచివి కూడా.
- సూర్య నమస్కారాల వలన పూర్తి శరీరానికి వ్యాయామం చేయబడుతుంది.
- సూర్య నమస్కారాల వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మరియు ఆపాదమస్తకం ఆరోగ్యంగా ఉండవచ్చును.
- సర్వ రోగాలకు ఒకటే మందు – సూర్య నమస్కారాలు.
- విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అంటారు. అలాగే సూర్యుడు సమస్కార ప్రియుడు.
- సూర్య నమస్కారాల వలన కీలకమైన ప్రాణశక్తిని నియంత్రించడంలో సహకరించి సహాయపడే ఆసనాలు, ప్రాణాయామం మరియు ధ్యాన పద్ధతులు ఉన్నాయి.
- యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారములు.
- సూర్య నమస్కారాల వలన శరీరంలో గల కీళ్ళు, కండరాలు, నరాలలో సులువుగా కదలిక కలుగుతుంది.
- సూర్య నమస్కారాల సాధన వలన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎదగగలము.
- సూర్య నమస్కారాలు సాధన ప్రకృతి పరంగా ఆరోగ్యాన్ని బాగు చేసుకొనే పద్దతి.
- సూర్య నమస్కారాలు నిత్య సాధన చేసిన మహత్తరమైన లాభాలు కలవు.
- సూర్య నమస్కారాలు నిత్య సాధన చేసిన శరీరం అంతా పనిచేస్తుంది.
- సూర్య నమస్కారాలు నిత్య సాధన చేసిన శారీరక మానసిక స్థితిలో తేడా తెలుసుకోవచ్చు.
- సూర్య నమస్కారాలు ఒక రౌండ్ చేసిన 36 కేలరీలు ఖర్చు అవుతాయి. అలాగే అరగంట చేస్తే తగ్గే క్యాలరీలు ఈ పట్టికలో చూడ వచ్చును:
అరగంట చేసిన | ఖర్చు అయ్యే క్యాలరీలు |
వెయిట్ లిఫ్టింగ్ | 199 |
టెన్నిస్ | 232 |
ఫుట్ బాల్ | 298 |
రాక్ క్లైంబింగ్ | 364 |
రన్నింగ్ | 414 |
సూర్య నమస్కారాలు | 417 |
15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేసిన 208 క్యాలరీలు తగ్గుతాయి.
అవయవాల పై ప్రభావం:
గుండె: ప్రతి భంగిమలో శ్వాస జరపడం వల్ల శ్వాస కోశ సామర్థ్యం మెరుగుపడి, ఊపిరితిత్తులు బలపడి ఛాతీ విప్పారుతుంది. అందువల్ల సర్వ అంగాలు ఆరోగ్యాన్నిస్తాయి . ఈ స్థితిలో గుండె మొదలైన అవయవాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి అంగ సౌష్టవం పెరుగుతుంది. మరియు గుండె ఆరోగ్యంగా/బలంగా ఉంటుంది.
రక్తం, జీర్ణ కోశం: జీర్ణకోశం, నాడీ వ్యవస్థ బలపడి రక్త ప్రసరణ సక్రమంగా జరిగి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ను సూర్య నమస్కారాలు పెంచుతాయి). అందువలన రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.
అజీర్తి, ఎసిడిటీ, మలబద్దకం: సూర్య నమస్కారాల వల్ల శరీరాన్ని ముందుకు వంచడం, సాగదీయం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పడి నడుము సన్నపడుతుంది. ఇది కడుపులో చిక్కుకున్న గ్యాస్ తేలికగా బయటకు వెళ్లేలా సహాయపడుతుంది. మరియు మధుమేహం నియంత్రణలో ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. నిత్య సాధన వలన అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఫ్లెక్సిబుల్ శరీరం: సూర్య నమస్కారాలు ఒక రౌండు చేసిన శరీరంలో విషపదార్థాలు కరిగిపోవడం వలన దేహ కదలిక సులువుగా ఉంటుంది (ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది.) దీని కారణంగా నరాలు, కండరాల కదలిక సులువుగా ఉండును.
డీటాక్సిన్: శరీరంలో గల ప్రతి అవయవాల్లో విషపదార్థాలు తొలగి ఆరోగ్యంగా ఉంచి శరీరం విశ్రాంతి స్థితిని పొందుతుంది. మరియు రోజంతా పని చేసినా అలుపు రానివ్వదు.
శరీరం, మనసు: మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా సహాయపడతాయి. మరియు ఆత్మను సమన్వయపరుస్తుంది.
సన్నబడటానికి: ఎముకలు, కండరాలు బలపడి ఎక్కువ కొవ్వు కరిగిస్తుంది. (మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది మరియు మజిల్స్ టోనింగ్ జరుగుతుంది) మరియు శరీరంలో ప్రతి భాగంలో పనిచేసి సన్నగా నాజూగ్గా తయారు చేస్తుంది.
బరువు: సూర్య నమస్కారాలు తక్కువ సమయంలో ఎక్కువ నిత్య సాధన చేసిన మెటబాలిక్ రేటును బాలెన్స్ చేస్తుంది. అందువలన బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. కనుక ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. మరో విధంగా ప్రతి అవయవంపై ఒత్తిడి పడుతుంది. శ్వాస పీల్చడం, వదలడం ద్వారా ఊపిరితిత్తులలోకి గాలి చేరుతుంది. తద్వారా ఆక్సిజన్ రక్తంలోకి చేరి, శరీరంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర విష వాయువులు తొలగింప బడుతాయి.
జుట్టు: సూర్య నమస్కారాలు నిత్య సాధన వలన తలలో రక్త ప్రసరణ పెరిగి తలకు పోషణ లభిస్తుంది. అందువలన జుట్టు ఆరోగ్యంగా పెరిగి తెల్లబడకుండా నిరోధిస్తుంది.
కళ్ళు: సూర్య నమస్కారాల వలన కంటి చూపు మెరుగు పడి చూపు పెరుగుతుంది.
జీర్ణ వ్యవస్థ: సూర్య నమస్కారాలు నిత్య సాధన చేసే సమయంలో శరీరం ముందుకు వెనుకకు వంగడం వలన , ఉదర అవయవాలు విస్తరించబడతాయి. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
ప్రాణం: పంచ ప్రాణాలకు శక్తినిస్తుంది.
వెన్నెముక: వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. మరియు సూర్య నమస్కారాలు శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి.
చర్మం: సూర్య నమస్కారాలు నిత్య సాధన వలన మొహంపై మచ్చలు తగ్గి కాంతివంతంగా తయారవుతుంది. సూర్య నమస్కారాలు సాధన వలన శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది, చర్మం ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉంటుంది. తద్వారా చర్మం యవ్వనంగా ఉంటుంది. ఇది శక్తిని మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది. తద్వారా ముఖం కాంతితో మెరుస్తుంది. సూర్య నమస్కారం శరీరం మరియు మనస్సు నుండి ఒత్తిడిని తగ్గించడం ద్వారా ముడతలు రాకుండా నిరోధిస్తుంది.
గ్రంథులు: సూర్య నమస్కారాలు నిత్య సాధన వలన “షట్ చక్రాలు” ప్రభావితమై శరీరంలో గల ముఖ్య గ్రంధులు (endocrine Glands) చక్కగా పనిచేస్తాయి. * “D” విటమిన్: ఉదయం సూర్య నమస్కారాలు సూర్యుని ముందు సాధన చేయడం వలన సూర్యునిలో గల శక్తి శరీరంలోకి ప్రవేశించి విటమిన్ “D” గా మారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరియు మెటబాలిజం పెంచుతాయి.
గుండె పై ప్రభావం
సూర్య నమస్కారాలలో పర్వతాసనం ( 5, 8 వ భంగిమలో) గుండె ఆరోగ్యంగా ఉండటానికి కారణం.
ఈ ఆసనములో నడుము పైకి, తల లోపలికి, కాళ్ళు తిన్నగా (మోకాళ్ళు వంచ కుండా) పాదాలు కలిసి ఉంటాయి. కాలి వేళ్ళు మరియు మడమలు నేలకు ఆని ఉంటాయి. అందువలన కాలి పిక్కలు సాగబడతాయి.
కాలి పిక్కలను రెండో గుండె అంటారు. మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం. గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ సరఫరా చేస్తుందో, మన రెండు కాళ్ళలో ఉన్న పిక్కలు కూడా అలాగే రక్తాన్ని పైకి సరఫరా చేస్తాయి.
పైగా గుండె నుంచి సరఫరా చేసే రక్తం భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్లకు చేరడం సులభం. కానీ కాళ్ల నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే పైకి, అనగా, భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ప్రవహించాలి. అందుకు మరింత శక్తి కావాలి. ఆ శక్తిని ఇచ్చేది కాలి పిక్కలే.
మన కాలి పిక్కలను గమనించి చూస్తే అటు ఇటుగా చూడ్డానికి గుండెలా కనిపిస్తాయి. అది నిజంగానే గుండె నిర్వహించే విధులు నిర్వహిస్తుంది. దానికి కారణం గుండె తన పంపింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంది. దానికో పంపింగ్ ప్రక్రియ ఉంది, పైగా గుండె శరీరంలో ఎగువన అనువైన ప్రదేశంలో ఉంది. కాబట్టి అన్ని వైపులకూ రక్తాన్ని పంప్ చేయడం సులభం. అయితే కాళ్లకూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలంగా పైకి రావాలి. అలా రావడంతో పాటు ఆ రక్తం అదనపు బరువును పైకి తనతో తీసుకొని వెళ్ళాలి . ఆవిధంగా చేసేందుకు పిక్కలు ఉపయోగపడతాయి. అందుకే వాటిని ‘కాఫ్ మజిల్’ పంప్ ( Calf muscle pump)or( C M P) అంటారు.
అంతేకాదు. శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్ ‘ ( peripheral heart) అని కూడా అంటారు. కాలి పిక్కలలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తుంటాయి. అయితే మరీ ముఖ్యంగా ఈ కండరాల్లోని రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోక్నేమియస్ కండరాలు (Gastrocnemius muscle), సోలియాస్ (Soleus muscle) కండరాలు ఈ విధిని నిర్వహించడంలో ముఖ్యంగా తోడ్పడతాయి. ఈ కండరాలు క్రమంగా ముడుచుకోవడం, తెరచుకోవడం (రిలాక్స్‌కావడం) అనే పనిని క్రమ బద్ధంగా చేస్తూ రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా రక్తం కిందికి రాకుండా నాన్ రిటనబుల్ వాల్వ్ సహాయంతో మూసుకుపోతూ వ్యతిరేక దిశలో అంటే పైకి రక్తం ప్రవహించేలా చేస్తుంటాయి. అందువలన ఈ పిక్కలను మన శరీరపు రెండో గుండెగా చెబుతారు.
మన శరీరలో రెండో గుండె అయిన పిక్కలు సరిగా పనిచేయకపోతే అప్పటికే వాడేసిన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ అప్పటికే కండరాల వల్ల వినియోగం అయిపోయి ఉండటం వల్ల మళ్లీ కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు. దాంతో కండరాలు తీవ్రమైన అలసటకు గురవుతాయి.
కాళ్ల చివరలకు రక్తసరఫరా చాలా తక్కువగా జరగడం వలన వ్యాధి నిరోధక శక్తి కలిగించేదే లింఫ్ ఓటీక్ వెసల్సు (lymphotic vessels) ప్రవాహం నిర్వీర్యం కావడం , చెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల వాటి పనులు నిర్వహించే సామర్థ్యం తగ్గడం జరుగుతాయి. అందువలన ఏర్పడే పరిణామాలు – కాళ్లు ఎప్పుడూ అలసటతో ఉండటం కాళ్లూ, పాదాలలో వాపు , వేరికోస్ వెయిన్స్ ( Varicose veins) వలన నరాలు ఉబ్బినట్లుగా చర్మం నుంచి బయటకు కనిపించడం, కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉండడం జరుగుతుంది.
పర్వతాసనం వలన ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
గుండెబలం అంటే అర్థం మనోబలం. అదే పిక్కబలం అంటే అధైర్యం చూపించి పరుగెత్తడం అని అర్థం. కానీ ఇక్కడ పిక్క గురించి, గుండెలా అది నెరవేర్చే విధుల గురించి నిజం తెలిసాక పిక్కల బలము ఇంచుమించు గుండె బలంతో సమానమే అని అర్ధం అవుతుంది.
శారీరక ప్రయోజనాలు
- ఇవి చేయడం వలన వాత, పిత్త, కఫ దోషాలు శాంతిస్తాయి.
- సూర్య నమస్కారాలు నిత్య సాధన వలన మంచి పోశ్చర్ మీ సొంతమవుతుంది.
- సూర్య నమస్కారాలు నిత్య సాధన శరీరంలో గల అవయవాలు (Internal Organs) యొక్క పని తీరు బాగుంటుంది.
మానసిక ప్రయోజనాలు
- ఆలోచనలో స్పష్టత కలుగుతుంది.
- మెదడుకి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. కావున మేధస్సుకు మంచిది.
- సూర్య నమస్కారాలు నిత్య సాధన వలన నిద్రలేమి సమస్యను సహజంగా పోగొట్టి చక్కని నిద్ర పట్టేలా చేస్తాయి.
- ఒత్తిడి తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడంలో సూర్య నమస్కారాలు సహాయ పడుతాయి. కాన్సంట్రేషన్, ఫోకస్ పెరుగుతాయి.
- సాయంత్రం సమయంలో సూర్య నమస్కారాలు నిత్య సాధన వలన ఒత్తిడి తగ్గుతుంది.
- కోపం, చిరాకు, అలుపు, చింత దూరం చేస్తుంది.
- ఈ సాధన వలన మనసు స్థిమితంగా ఉండి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- బద్ధకాన్ని దూరం చేస్తుంది
- ఆతృత (anxiety) తగ్గుతుంది.
- శరీరానికి శక్తి నిచ్చి విశ్రాంతి నిస్తుంది. మనస్సుకు ప్రశాంతతని ఇచ్చును.
అధ్యాత్మిక ప్రయోజనాలు
చక్రాలు: సూర్య నమస్కారాలు నిత్య సాధన చేసిన శరీరంలో గల “షట్ చక్రాలు” ప్రభావం అవుతాయి.
పిల్లలకు ప్రయోజనాలు
- పిల్లల మనస్సును ప్రశాంత పరుస్తుంది.
- ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది మరియు ఓర్పును పెంచుతుంది.
- సూర్య నమస్కారాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరానికి బలం మరియు శక్తి లభిస్తుంది.
- 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కూడా ప్రతి రోజూ సూర్య నమస్కారాన్ని అభ్యసించ వచ్చును.
స్త్రీలకు ప్రయోజనాలు
- మహిళలకు సూర్య నమస్కారాలు చాలా లాభ దాయకం.
- సహజంగానే సూర్య నమస్కారాలు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
- సూర్య నమస్కారాలు థైరాయిడ్ గ్రంథి వంటి గ్రంథులలో హార్మోన్ల స్రావాలను పెంచడానికి ప్రేరేపిస్తాయి. మరియు హార్మోనల్ ఇంబాలన్స్ సమస్యను సరి చేస్తుంది.
- సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల మహిళల ఋతుధర్మం నియంత్రించుతుంది.
- ప్రీరియడ్ ప్రాబ్లం నుండి రిలీఫ్ ఇస్తాయి. అంతేకాకుండా, ఇది ముఖం మెరుస్తూ ఉండటానికి మరియు ముడతలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
సూచనలు
- మనకు వ్యాయామం చేయడానికి సమయం దొరకనే దొరకదు. సరైన వ్యాయామం లేకపోతే శరీరక సమస్యలే కాదు, మానసిక సమస్యలూ చుట్టు ముడతాయి. మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా సహాయపడతాయి. సూర్య నమస్కారాలు చేయడానికి గంటల సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజుకు 15 నిమిషాలు సాధన చేసిన మంచిది.
- కరోనరీ ఆర్టరీ వ్యాధులు, వెన్నెముక గాయం, హెర్నియా, పెప్టిక్ అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయకూడదు. వెన్ను సమస్యలు ఉన్నవారు వైద్య నిపుణుడిని సంప్రదించి చేయాలి.
- గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన మూడవ నెల తర్వాత చేయవచ్చును.
- ఋతుస్రావం సమయంలో చేయకూడదు
- సూర్య నమస్కారాలను సరిగ్గా చేయకపోతే శరీరానికి హాని కలిగిస్తుంది.
- రెండవ ఆసనాన్ని చేసేటప్పుడు మెడను జాగ్రత్తగా చూసుకోవాలి.
- సూర్య నమస్కారాలు బ్రాహ్మీ ముహూర్తంలో నిత్య సాధన చేసిన చాలా ఫలితాన్ని ఇస్తాయి.
- పురాణాల ప్రకారం చాలా మంది పెద్దలు పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తారు. అలాగే ఉదయం పూట సూర్యుని ముందు కూర్చొంటారు. అందు వలన ఆయురారోగ్యాలు లభిస్తాయి. అలాగే పొద్దున్నే వచ్చే ఎండ వలన శరీరానికి విటమిన్ “డి” లభిస్తుంది. ఇది ఆరోగ్యం కోసం. అలాగే సూర్య నమస్కారాలు కూడా.
యోగాచార్య ధరణీప్రగడ ప్రకాశ్ రావ్
98490 66765