
పశ్చిమోత్తానాసనం లేదా పశ్చిమతానాసనం – ఇది సంస్కృత పదం. పశ్చిమం= శరీరంలో వెనుక భాగం/వీపు భాగం అని అర్థం, తాన్ = సాగదీయడం, ఉత్తాన్=సాగదీయడం. శరీరం వెనుక భాగాన్ని సాగదీసే ఆసనం. ఇది కూర్చుని చేసే ఆసనం. ఈ ఆసనం చేయడం కఠినం కావున దీనిని ఉగ్రాసనం అందురు. “శివ సంహిత”లో దీని ప్రస్తావన కలదు. ఈ ఆసనం శివునికి ప్రీతికరమైనది.

ముందు మాట
ఏ ఆసనం చేయాలన్నా ముందు జాగ్రత్త ( precaution ) అవసరం. లేని ఎడల శరీరానికి లాభం కన్నా నష్టం ఎక్కువ. పశ్చిమోత్తానాసనం చేసే చాలా మందికి నడుము నొప్పి సమస్య కలుగుతుంది. ఆ సమస్య రాకూడదు అంటే పద్ధతి ప్రకారం చేయవలెను. ముందుకు వంగే ఆసనం ఏదైనా కాని ఒక పద్దతిగా చేయవలెను. లేని ఎడల శరీరానికి కీడు చేస్తుంది.ఈ ఆసనమునకు వయోపరిమితి లేదు. ఏ వయసు వారైనా వేయవచ్చు.
- ఇది ఎంతో ముఖ్యమైన ఆసనము, కానీ సరియైన పద్ధతిలో చేయవలెను.
- దీని సాధన వలన అనేక మహత్తరమైన లాభాలు కలవు.
- ఆసనాలు ఉదయం లేక సాయంత్రం చేయవచ్చును.
విధి
- నేలపై జంబుకానా/యోగ మ్యాట్/ ఆసనం వేసుకుని ఆసనం పై కూర్చోవాలి.
- కాళ్ళు చాపి కలిపి ఉంచాలి. ఈ స్థితి లో మోకాళ్లు వంచకూడదు.
- రెండు చేతులూ మోకాళ్ళ పైన ఉంచాలి (దండాసన స్తితి).
- శ్వాస తీసుకుంటూ చేతులు ముందు నుంచి లేక పక్కనుంచి పైకి ఎత్తాలి. ఈ స్థితిలో నడుము, తల వీలైనంత నిటారుగా ఉంచాలి. మోచేతులు వంచకూడదు.
- శ్వాస వదులుతూ ఛాతిని ముందుకు వుంచుతూ ముందుకు వంగాలి. ఈ స్థితి లో తల తిన్నగా ఉంచాలి.
- చూపుడు, మద్య వేళ్ళతో కాళ్ళ బొటన వేళ్ళను (లేక పాదాలను) పక్కనుండి (లేక చేతులను కాళ్ళ వెలుపల నుంచి ముందుకు చాపి) పట్టుకోవాలి. ఈ స్థితిలో మోచేతులు కొంచెం దూరం చేయాలి.
- నెమ్మదిగా మోచేతులు వంచుతూ నేలకు ఆనించాలి.
- తలను వంచి మోకాళ్ళ కన్నా ముందుకు ఆనించాలి.
- శ్వాస తీసుకుంటూ, కాలి వేళ్ళను వదులుతూ చేతులు పైకి ఎత్తుతూ లేవాలి.
- శ్వాస వదులుతూ చేతులు ఇరు ప్రక్కల నుంచి దించాలి. మోచేతులు వంచకూడదు.
- చేతులు వెనుకకు, తల వెనుకకు, నడుము తిన్నగా చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి.

ఈ విధంగా 3 సార్లు చేయాలి.

సూచన
- ఈ ఆసనంలో కూర్చుని కాళ్ళు తిన్నగా ఉంచాలి. మోకాళ్ళు వంచ కూడదు. ఈ స్థితిని దండాసనం అందురు. ఈ స్థితిలో కాళ్ళు తిన్నగా శరీరం నిటారుగా 90°ఉండవలెను. లేని ఎడల పశ్చిమోత్తానాసనం చేయకూడదు.
- కాలి బొటన వేలుని చూపుడు, మద్య వేళ్ళతో పట్టుకోవాలి (లేక పాదాలు పక్కనుండి పట్టుకోవచ్చు).
- ఈ ఆసనంలో శరీరం సహకరించిన వరకు ముందుకు వంగాలి, తరువాత తలను వంచాలి.
- తలను కాళ్ళ దగ్గిర, ఛాతిని తొడలపైన ఆనించాలి. శ్వాస వదులుతూ ముందుకు వంగాలి.
- కొద్ది సమయం కదల కుండా ఉండాలి. శక్త్యానుసారం చేయాలి. ఈ స్థితిలో పొట్ట లోపలికి ఉంచాలి. నడుము, తల తిన్నగా ఉంచాలి.
- నడుము (వెన్ను) చేతులు పైకి ఎత్తి నప్పుడు పైకి లాగాలి. చేతులు ముందుకు సాగదీయాలి.
- ఈ ఆసనం కాళీ కడుపుతో చేయాలి.
- వీలైనంత వరకూ కాళ్ళు తిన్నగా, పిరుదులు నేలకు, నడుము, తల తిన్నగా ఉంచుతూ వంగాలి.
- సర్వైకల్ సమస్య ఉన్న వారు మోకాళ్ళకు గడ్డాన్ని తగిలించ వలెను.
- ఈ ఆసన స్థితిలో వెన్నెముక వంగకూడదు.
సమయం
ఈ ఆసనంలో 30 సెకెన్ల నుంచి 15 నిమిషాల వరకు ఉండవచ్చును. ముందు 30 సెకెన్ల తో మొదలు పెట్టి నెమ్మదిగా సమయం పెంచవచ్చును.
శ్వాస విధానము
- ఆసన స్థితిలో బాహ్య కుంభకంలో లేక సామాన్య శ్వాసలో ఉండవచ్చును.
- శ్వాస తీసుకుంటూ రెండు చేతులూ పక్క నుంచి పైకెత్తవలెను.
- ఈ ఆసనం వేస్తున్నప్పుడు శ్వాస వదులుతూ వేయాలి. శ్వాస తీసుకుంటూ ఆసనం వదలాలి.
ఆధ్యాత్మిక ప్రయోజనాలు
- ఇది వీపులో గల వెన్ను పూసలలో సుషుమ్న నాడి ద్వారా ప్రాణ శక్తిని ప్రవహించు నట్లు చేయు ఆసనము. ఇది అభ్యసించినప్పుడు ధ్యాస మణిపూర చక్రం పైన ఉంచాలి.
- ఈ ఆసన సాధన వలన ధ్యాన స్థితిలో ఎక్కువ సమయం కూర్చో గలరు. కుండలిని జాగృతి చేయును.
మానసిక ప్రయోజనాలు
ఈ ఆసన సాధన వలన ఒత్తిడి, ఆత్రుత తగ్గి మానసిక శాంతి కలిగి మంచి నిద్ర పడుతుంది.
చంచల మనసు వారికి ఇది మంచిది. మానసిక సమస్యలు తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. తలనొప్పి రానివ్వదు.
శారీరక ప్రయోజనాలు
- ఈ ఆసనం వలన మన శరీరంలో కాలి వేళ్ళనుంచి తలపైన సహస్రార చక్రం వరకు ప్రతీ భాగము ప్రభావితం అవుతాయి.
- ఇది ఒక పద్ధతిలో చేసిన చాలా రకాల శారీరక, మానసిక సమస్యలు పోగొట్టును.
- ఈ సాధన వలన పాంక్రియాస్ ప్రభావితమై మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది, బాన పొట్ట తగ్గుతుంది.
- పొట్టలో ఉన్న మాంస కండరాలు ఆరోగ్యంగా తయారయి, ఉదర పనితీరును మెరుగుపరుస్తుంది.
- అందువల్ల అరుగుదల బాగుచేసి మలబద్దక సమస్య దూరం చేస్తుంది.
- ఈ ఆసన సాధన వలన వెన్నెముక, భుజాలు, తొడల వెనుక కండరాలు సాగుతాయి.
- కాలి పిక్కలు రోజూ గట్టి పడుతూ ఉంటాయి. ఈ ఆసనం నిత్య సాధన వలన అవి సాగబడి,కాలి పిక్కలు మెత్తబడి శరీరం పెరగడానికి సహాయపడుతుంది. కావున 18 ఏళ్ళు లోపు పిల్లలు పొడుగు పెరగడానికి సహాయపడుతుంది.
- తొడల వెనుక కండరాలు (Hamstrings )మరియు వెన్ను పూస చక్కగా పనిచేయడానికి ఈ ఆసనం ఎంతో సహకరిస్తుంది. పశ్చిమోత్తానాసన సాధన వలన శరీరం మరియు మెడలో మాంస కండరాలు సాగి రక్త ప్రసరణ చక్కగా జరిగి, వెన్నుకు బలాన్నిస్తుంది. తద్వారా ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది.
- ఈ ఆసన సాధన వలన మన వెనక శరీరంలో గల అన్ని కండరాలు ప్రభావితం అవుతాయి. మహిళలకు ఋతు సమస్యలకు, మెనూపాస్ సమస్యలకు ఈ ఆసనం మంచి పరిష్కారం. ఈ ఆసనం వలన సహజంగా ఉడ్డియాన బంధం, మూల బంధం జరుగుతుంది. తిన్న పదార్థాలు సరిగ్గా అరగక పుల్ల తేన్పులు కలిగే సమస్య తగ్గుతుంది.
- ఈ ఆసనం నిత్య సాధన వలన రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. పశ్చిమోత్తానాసనం నిత్యసాధనవలన నపుంసకం దూరం చేస్తుంది. ఎముకలలో కరుకుదనం /పెళుసు (temper) తగ్గిస్తుంది.
- కిడ్నీలు ఆరోగ్యంగా ఉండి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మహిళలకు PCO సమస్యలకు ఇది మంచి ఆసనం.
- ఊపిరితిత్తులు మరియు లీవర్ లకు బలం చేకూరుతుంది. ఆపాదమస్తకం రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది.
- కిడ్నీలు, అడ్రినల్, స్ప్లీన్ ప్రభావితం అవుతాయి. ముఖంలో మంచి కాంతి వస్తుంది. గ్రంధులు చక్కగా పనిచేస్తాయి.
- హార్మోన్ల సమస్యలకు మంచిది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వెన్నుకు బలాన్నిస్తుంది. ఛాతి విప్పారుతుంది .
- పొట్ట తగ్గుతుంది.
నిషేధం
- తిన్న వెంటనే ఈ ఆసనం చేయకూడదు.
- సయాటికా సమస్యలవారు ఈ ఆసనం చేయకూడదు.
- గర్భవతి మహిళలు పశ్చిమోత్తానాసనం చేయకూడదు.
- సర్వైకల్ స్పాండిలోసిస్ వారు ఈ ఆసనం చేయకూడదు.
- ముందుకు వంగుతున్నప్పుడు నడుము, తల వంచకూడదు.
- నడుము నొప్పి వారు మెల్లిగా లేవ వలెను, ఒత్తిడి పెట్టకూడదు.
- హృదయ సమస్యలు, హై బిపి, మెడ సమస్యలు, స్పైనల్ సర్జరీ అయిన వారు ఈ ఆసనం చేయకూడదు.
-యోగాచార్య ధరణీప్రగడ ప్రకాశ్ రావ్ – 98490 66765
సూచన: నిష్ణాతులైన యోగచార్యుల వద్ద యోగాను అభ్యసించాలి అనుకుంటున్నారా? యోగచార్య ధరణీప్రగడ ప్రకాశ రావు గారి వద్ద స్వయంగా అభ్యసించండి! యోగాను, ముఖ్యంగా పశ్చిమోత్తానాసనం ఎలా చేయాలి అని మరియు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం మెళుకువలన్నీ తెలుసుకోండి!